- అనారోగ్యంతో చనిపోతే శవం దగ్గరకు ఎవరూ రాలేదు
- భుజంపై వేసుకుని మూడున్నర కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త
- దహన సంస్కారాల కోసం మధ్య మధ్యలో శవాన్ని దించి భిక్షాటన
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో దారుణఘటన చోటు చేసుకుంది. భిక్షాటన చేసుకుని పొట్ట పోషించుకునే నాగలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో చనిపోయింది. అయితే కరోనాతో చనిపోయిందేమోనని ఈమె శవం తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఆటో డ్రైవర్లు సైతం నిరాకరించారు. పరిస్థితి తెలుసుకున్న రైల్వే పోలీసులు, స్థానికులు 2500 చందాలు వసూలు చేసుకుని మృతురాలి భర్త స్వామికి ఇచ్చారు.
అంత్యక్రియలకు తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి ఉండడంతో భర్త స్వామి తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు మోసుకుంటూ తీసుకెళ్లాడు. మధ్య మధ్యలో శవాన్ని దింపి దహన సంస్కారాల కోసం భిక్షాటన చేసుకుంటూ వెళ్లాడు. హృదయ విదారకమైన ఈ ఘటన పట్టణంలోని పలు దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. వీటిని స్థానికులు షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన అవమానవీయమైన ఈ ఘటన చర్చనీయాంశం అయింది.
